గజ్వేల్‌ నుంచే హెల్త్‌ కార్డుల ప్రక్రియ: కేసీఆర్‌

గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే హెల్త్‌ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కంటి వెలుగు పథకం మాదిరే గజ్వేల్‌ నుంచే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేది తన కోరిక అని ఆయన అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ బుధవారం మహితి ఆడిటోరియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ప్రొఫెల్‌ తయారు చేయిస్తాం. త్వరలోనే గజ్వేల్‌ నియోజకవర్గ ఆరోగ్య సూచిక వెంటనే రూపొందించాలి.

హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రజలందరికీ చాలా ఉపయోగకరం. ప్రజల వైద్య పరీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. 15-20 రోజుల్లో గజ్వేల్‌ నియోజకవర్గంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. త్వరలో ఒకరోజంతా మీతోనే ఉంటా. గజ్వేల్‌ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకుందాం. స్వయం సమృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం. హరితహారంలో దేశానికే ఆదర్శంగా గజ్వేల్‌ ఉండాలి. అలాగే గజ్వేల్‌లో ఇల్లులేని నిరు పేదలు ఉండకూడదు.  నియోజకవర్గంలో పార్టీలు, పైరవీలు లేకుండా అందరికీ డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు అందిస్తాం. ప్రతి కుటుంబానికి ఏదో ఒక పని కల్పించేలా చర్యలు’ చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© Copyright 2015. All Rights Reserved. AsrSoftTech |