భర్తతో అక్రమ సంబంధం.. సూదులతో గుచ్చి గుచ్చి!

 భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారన్న అనుమానంతో ఓ వైద్యురాలు నర్సులను కత్తులతో, సూదులతో గుచ్చి హింసించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన.. బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. డాక్టర్ విజయలక్ష్మి ఆమె భర్త రామకృష్ణ సూర్యాపేటలో ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. భార్యాభర్తలు అదే ఆస్పత్రిలో వైద్యులుగా సేవలు అందిస్తున్నారు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సులతో తన భర్త వివాహేతర సంబంధం నడుపుతున్నాడన్న అనుమానం భార్యకు ఏ‍ర్పడింది. ఈ నేపథ్యంలో సదరు వైద్యురాలికి, నర్సులకు ఈ విషయంలో  పలుమార్లు గొడవులు కూడా జరిగినట్లు తెలిసింది.

అదే అనుమానంతో కొన్ని రోజుల క్రితం మహిళా నర్సు లను విధుల నుండి తొలగించారు. ఈ క్రమంలోనే ఈనెల 6న వైద్యురాలు భర్త లేని సమయంలో నర్సులు సునీత, ప్రమీలను పిలిపించి చైర్లో కూర్చోపెట్టి బంధించింది. యాసిడ్, పినాయిల్‌తో బెదిరించి సూదులతో గుచ్చి, గుచ్చి ఆపరేషన్ చేసే కత్తులతో గొంతుపై పెట్టి  హింసించింది. తన భర్తతో లైంగిక సంబంధం ఉందా లేదా? అని ప్రశ్నిస్తూ సునీతపై బీభత్సం సృష్టించింది. అక్రమ సంబంధం ఉంటే మానుకోవాలని భయబ్రాంతులకు గురి చేసింది. కొన్ని గంటల పాటు వైద్యురాలు సునీతపై దాడి చేస్తూ ఉండడంతో ఏమీ చేయలేక అక్కడే ఉన్న తోటి నర్సు ప్రమీల, ఆండాళ్ అలాగే ఉండిపోయారు. సుమారు ఆరు గంటల తరువాత సునీత తోటి నర్సుల సహాయంతో తప్పించుకొని వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© Copyright 2015. All Rights Reserved. AsrSoftTech |