‘సాహో సజ్జనార్‌’ అంటూ ప్రశంసలు..

దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేస్తోంది. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటు సంతోషం తెలుపుతున్నారు. అలాగే పలు కళాశాలల్లో విద్యార్థినులు .. మా ఆడపిల్లకు న్యాయం జరిగిందంటూ  నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి భారీగా జనాలు తరలి వచ్చారు. పోలీసులను ప్రశంసిస్తూ పూల వర్షం కురిపించారు.

మరోవైపు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాహో సజ్జనార్‌… శభాష్‌ సజ్జనార్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పదేళ్ల క్రితం వరంగల్‌లో యాసిడ్‌ దాడికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థినులపై యాసిడ్‌ దాడి చేసిన నిందితులను పోలీసులు ఘటనా స్థలంలో ఎన్‌కౌంటర్‌ చేశారు. అప్పుడు వరంగల్‌ ఎస్పీగా సజ్జనార్‌ ఉన్నారు. ప్రస్తుతం దిశ నిందితులను కూడా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇప్పుడు కూడా సైబరాబాద్‌ సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

మళ్లీ పదేళ్ల తర్వాత అదే సంఘటన చటాన్‌పల్లిలోనూ పునరావృతం అయింది. దిశపై అత్యాచారం చేసి, హతమార్చిన నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. అప్పుడు, ఇప్పుడు ఎన్‌కౌంటర్ క్రెడిట్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్‌దే. దీంతో సజ్జనార్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో కూడా వరంగల్‌ యాసిడ్‌ దాడి నిందితులు కూడా డిసెంబర్‌ నెలలోనే ఎన్‌కౌంటర్‌ అయ్యారు.

2008 తర్వాత మళ్లీ ఇదే…
వరంగల్‌ జిల్లాలో 2008లో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థినులపై యాసిడ్‌ దాడి సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష‍్టించింది. వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతలపై 2008 డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు యువకులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక మృతి చెందగా, ప్రణీత చాలాకాలానికి కోలుకోగలిగింది. యాసిడ్‌ దాడికి పాల్పడ్డ ముగ్గురు యువకులు అరెస్టై, మూడు రోజుల అనంతరం 2008, డిసెంబర్‌ 13) నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఎన్‌కౌంటర్‌పై సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ… దిశ హత్యకేసు నిందితులను సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులుపై దాడి చేశారని, తప్పించుకుని పారిపోతుండగా, పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిపారు. పోలీసుల నిర‍్వహణలో భాగంగానే ఎన్‌కౌంటర్‌ జరిగిందని అన్నారు. మరోవైపు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© Copyright 2015. All Rights Reserved. AsrSoftTech |