యంగెస్ట్‌ క్రికెట్‌ కోచ్‌

లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడా యువకుడు. పేదరికంలో ఉన్నా పట్టుదలతో సాధన చేసి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు నగరానికి చెందిన పంతొమ్మిదేళ్ల షేక్‌ మహ్మద్‌ గౌస్‌. ఈ పేద యువకుడు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌లో ఇండియా నుంచి యంగెస్ట్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. అహర్నిశలు కష్టపడి సాధన చేసి పెద్దలను మెప్పించి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడి ప్రయాణం అంత సాదాసీదాగా సాగలేదు. 

టోలిచౌకిలో నివసించే గౌస్‌ తండ్రి అబ్దుల్‌ ఖాదర్‌ వలీ వికలాంగుడు కాగా, తల్లి పర్వీన్‌ చీరలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కృష్ణానగర్‌లోని విద్యానికేతన్‌ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివిన మహ్మద్‌ గౌస్‌ ప్రస్తుతం కూకట్‌పల్లిలోని గౌతమి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తన పదో ఏట నుంచే క్రికెట్‌ పట్ల మక్కువ పెంచుకున్న ఇతడు స్కూల్‌తో పాటు కాలేజీలోనూ క్రికెట్‌ టీమ్‌లో అద్భుత ప్రతిభ చూపించాడు. అయితే, ఆర్థికంగా వెనుకబడటం, పెద్దల ప్రోత్సాహం లేకపోవడంతో ప్రతిభ ఉన్నా జాతీయ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. అండర్‌–19 జట్టులోకి వెళ్లడానికి ఇతడు చేసిన ప్రయత్నాలకు కూడా ప్రోత్సాహం లేకపోవడంతో విఫలమయ్యాయి. సురేందర్‌ అగర్వాల్‌ టీమ్‌లో ఆడిన మహ్మద్‌ గౌస్‌ ప్రతిభ దశదిశలా చాటినట్లయింది. గత ఆగస్టులో దుబాయ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో మహ్మద్‌ గౌస్‌ను ఎంగెస్ట్‌ కోచ్‌గా నియమించారు. యూఏఈ క్రికెట్‌ యాజమాన్యం ఈ యువకుడ్ని కోచ్‌గా రావాలంటూ పిలిచినా వెళ్లలేదు. మనదేశాన్ని వదిలి మరో దేశానికి వెళ్లి కోచింగ్‌ ఇవ్వడానికి మనసొప్పలేదని చెబుతున్నాడీ యువకుడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© Copyright 2015. All Rights Reserved. AsrSoftTech |